మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

మహబూబ్‌నగర్‌: దేశంలో క‌రోనా మ‌హ్మ‌మ్మారి విజృంభిస్తోంది. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు చాలా మంది ఇప్ప‌టికే కరోనా బారిన ప‌డ్డారు. తాజాగా తెలంగాణలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకొని, జాగ్రత్తలు పాటించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా గత కొన్ని రోజుల నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో శుంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. నిన్న చిన్న చింతకుంట మండల కేంద్రంలో రైతువేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే తాజాగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని కీలక నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని నిరంజన్ రెడ్డి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.