మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం: మంత్రి అల్లోల
వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ప్రజలు స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఒక లక్ష మట్టి గణపతులను అందజేస్తున్నామన్నారు. పర్యావరణానికి హానీ కలగకుండా మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించి, అన్ని విఘ్నాలు తొలగేలా చూడాలని ఆ గణేశున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.