మరో మూడు రోజులు ముసురు
మరో మూడు రోజులు ముసురు
హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ర్టంలో మూడ్రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న గాంగేటిక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ర్టంలో మూడు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్, కోమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వెంకటాపురం మండలంలో 15.2 సెం.మీ వర్షం
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలంలో 15.2 సెం.మీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా విస్తతంగా వర్షాలు కురుస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని ఎర్రకుంట చెరువులో చేపలవేటకు వెళ్లిన గొత్తికోయ యువకుడు గల్లంతయ్యాడు. రాష్ర్ట వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిసా తీరాలకు దగ్గరలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 1 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాకాల ఏరు పొంగుతుండటంతో డ్యాం పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. దీంతో గార్లతో పాటు సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ముసురు కమ్మింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 3.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురుతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
మేడిగడ్డకు భారీగా వరద
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోకి 3.1 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 57 గేట్లను ఎత్తి 3.21లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలోకి మానేరు, ఇతర ప్రవాహాల ద్వారా 1,75 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. మేడిగడ్డలో .494టీఎంసీలు, అన్నారం బ్యారేజీలో 9.25టీఎంసీల నీరు ఉంది. శ్రీరామసాగర్‌కు 23, 550 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 90 టీఎంసీలకుగాను జలాశయంలో 41 టీఎంసీల నీరు ఉంది. కాగా, ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 5,7,724 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రవాహం భారీగా పెరుగుతుండడంతో గోదావరిలో లాంచీలు, బోట్లు, ఇసుకతీత నావల ప్రయాణంపై నిషేధం విధించారు.
బూర్గంపహాడ్‌లో 15.4 సెం.మీ. వర్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గురువారం 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు మండలాల్లో 13 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నపురెడ్డిపల్లి, ముల్కపల్లి, టేకురెడ్డిపల్లి, గార్ల మండలాల్లో 10, భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్ జిల్లాల్లో .7 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.