మహాయజ్ఞంలా అన్నప్రసాదం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. ప్ర‌తిరోజూ వంద‌లాది మందికి అన్న‌దానం చేస్తూ ఎంద‌రో అభాగ్యుల క‌డుపులు నింపుతుంది `శ్రీ మోత్కూరు రామశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్`.

యావ‌త్ ప్ర‌పంచం భ‌యం గుప్పిట్లో కాలం వెల్ల‌దీస్తున్న స‌మ‌యం… ఓవైపు కరోనా వైరస్ భయం, మరోవైపు లాక్‌డౌన్‌తో జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి. లాక్‌డౌన్ సమయంలో తిండి లేక రోడ్లపై ఇబ్బందిపడుతున్న అనాథలకు అండగా నిలుస్తున్నారు కొంద‌రు. ప్రాణాంతకమైన కరోనావైరస్ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా బాధిత వారికి సహాయం అందించడానికి “శ్రీ మోత్కూరు రామశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్” ముందుకు వచ్చింది. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మం సాగిస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నివసించే నిరాశ్రయులు రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కూలీలల‌కు ఈ ట్ర‌స్టు అక్ష‌య పాత్ర అయింది.

క‌రోనా క‌ష్ట కాలంలో అన్నంకోసం అల‌మ‌టించే వారిని చూసి చ‌లించిపోయారు మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి. పేద‌ల‌కు క‌డుపు నింపాల‌నే సంక‌ల్పంతో సికింద్రాబాదు, అల్వాల్ పరిధిలోని కానాజీ గూడలో వెలసిన సుప్రసిద్ధ మరకత గణపతి స్వామి ఆశీస్సులతో ప్రతిరోజు అభాగ్యులను ఆదుకోవ‌డానికి శ్రీకారం చుట్టారు. నాటి నుండి నేటి వ‌ర‌కు ప్ర‌తిరోజూ మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిత్య అన్నప్రసాద వితరణ జరుగుతుండడం విశేషం.
ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ప్రతి రోజు వందలాది మందికి ఆహారాన్ని అందజేస్తూన్నారు. నిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఘంటానాదము తో ప్రారంభం అయి దాదాపు మూడు గంటల పాటు కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యంలో ఆక‌లితో ఉన్న‌వారెంద‌రో ఇక్క‌డి వ‌చ్చి త‌మ ఆక‌లిని తీర్చుకుంటుంటారు. ముఖ్యంగా ఈ క‌రోనా సంయంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలోని అనేకమందికి ప‌ట్టెడ‌న్నం పెట్టింది అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

శ్రీ మోత్కూరు రామశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ నేప‌థ్యం

నల్లగొండ జిల్లా, మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తన తండ్రి జ్ఞాపకార్థం “శ్రీ మోత్కూరు రామశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్`ను స్థాపించారు. ఈ ట్ర‌స్టు ద్వారా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పేదవారికి ఉచిత వైద్య సౌకర్యాలు, నిరుపేద విద్యార్థులకు విద్యా వసతులు, వృద్ధాశ్రమాలకు చేయూతనిస్తూ సామాజిక సేవ చేస్తున్నారు.

-వెంకటాయోగి రఘురామ్

Leave A Reply

Your email address will not be published.