ముంబ‌యి వెళ్లాలా.. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు త‌ప్ప‌నిస‌రి

మ‌హారాష్ట్ర స‌ర్కార్ కొత్త ఆంక్ష‌లు..

ముంబ‌యి: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెండోసారి విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ, రాజస్తాన్‌, గుజరాత్‌, గోవా రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కోలుకున్నాక మాత్రమే రాష్ట్రంలోకి ప్రవేశం ఉంటుంది. నెగెటివ్‌గా ధ్రువీకరించాలంటే కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టులను చూపించాలని సూచించింది.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. రెండువారాల పాటు కరోనా కేసులను పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ కాకపోయినా సడలించిన ఆంక్షలను మళ్లీ విధించాల్సి వస్తుందేమోనని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌టోపే తెలిపారు. పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాలనుండి విమానం, లేదా రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టును చూపాల్సి ఉంటుంది. 72గంటల కింద చేయించుకున్న పరీక్షలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు 96గంటలలోపు రిపోర్టును చూపాలి. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను (ఎన్‌ఓపీ)ని రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది.

మహారాష్ట్రంలో తాజాగా 4,153 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖాధికారులు సోమవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 17,84,361కి చేరింది. ఇక రాష్ట్రంలో కోవిడ్‌తో ఇప్పటివరకు 46,653మంది మృతి చెందారు.ముంబయి నగరంలోనూ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

అలాగే అంబేద్కర్‌ 64వ మహాపరినిర్వాణ్‌ దిన్‌ సందర్భంగా డిసెంబర్‌ 6న ముంబైలో చైతన్యభూమిలో ఉన్నబాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక చిహ్నం వద్దకు అభిమానులు రావొద్దని, ఇంటివద్దనే నివాళి అర్పించాలని, ఇందుకు అభిమానులు సహకరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.