యుద్ధ నౌకల్లో ‘మహిళా’యుగం..

న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. నౌకా దళంలోని పలు ర్యాంకుల్లో ఎంతో మంది మహిళా అధికారులున్నా, యుద్ధ నౌకల్లో మాత్రం మహిళల నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేవీ బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, ఇంటెలిజెన్స్, నిఘా పరిశీలన, సెన్సార్ ఆపరేటింగ్‌తో పాటు వివిధ అంశాల్లో వీరు శిక్షణ తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిద్దర్నీ అత్యాధునికమైన ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాక్‌హీడ్‌-మార్టిన్‌ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు. కాగా రఫేల్‌ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్‌ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది.

 

Leave A Reply

Your email address will not be published.