రజనీకాంత్ కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఖరారు!

చెన్నై:సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. సొంతంగా పార్టీని పెట్టి 2021లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రజినీకాంత్ కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈనెలాఖరున పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ మేరకు కొత్త పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను నియమించుకున్నారు. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలపై కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. గతవారంలో ముఖ్యనేతలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రకటించే పేరు, గుర్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రజినీకాంత్ తన కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీస (ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్టైంది. రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో అని సోషల్ మీడియాలో లీక్ కావడంతో తమిళనాడులో ఆటో సింబల్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అభిమానులు బాషా లోని రజినీకాంత్ ఆటో ఫోటోలను పోస్టు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు రజినీ ‘బాబా లోగో’ను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్ స్వయంగా వెల్లడించనున్నారు.