రవాణా శాఖలో `స్మార్ట్ సేవలు`
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

హైదరాబాద్ : రవాణా శాఖలోని ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్ లైన్ లో సేవలు పొందేలా కొత్తగా మరో 6 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇంట్లోనుంచే కంప్యూటర్ లేదా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా కావల్సిన సేవల కోసం అప్లై చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర లైసెన్స్‌ను ఆమోదించడం, గడువు ముగిసిన లెర్నర్ లైసెన్స్ స్థానంలో కొత్త లెర్నర్ లైసెన్స్, వాహన తరగతిని చేర్చడానికి అభ్యాస లైసెన్స్, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం లెర్నర్ లైసెన్స్ జారీ వంటి మరో 6 ఆన్ లైన్ సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. గత జూన్ 24న డూప్లికేట్ ఎల్‌ఎల్‌ఆర్ (లెర్నర్ లైసెన్స్), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలతో ఆర్టీఏ ఆఫీసుల్లో పనుల కోసం ఏజంట్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ఎంపిక చేసిన సేవలను పొందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో అందిస్తున్న రవాణా శాఖ ఆన్ లైన్ సేవలకు మంచి స్పందన వస్తోందని, పౌర సేవల్ని మరింత సుల భతరం చేసేందుకు రవాణా శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
వాహనదారులు ఇక నుంచి ఏలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే పలు రకాల సేవలను పొందేందుకు నిర్ణయం తీసుకున్నారు.
జాప్యం లేకుండా సత్వరమే సేవలు
గతంలో అందుబాటులోకి వచ్చిన 5 ఆన్ లైన్ సేవల కొనసాగింపుగా మరో 6 ఆన్ లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు చెప్పారు. పత్రాల కోసం అటూ ఇటూ కార్యాలయాలకు తిరగే పని లేకుండా, ఇతరుల ప్రమేయాన్ని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పరుస్తున్న మరి కొన్ని ఆన్లైన్ సేవలను సాంకేతికంగా పరీక్షించిన తరువాత క్రమంగా ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ సేవల ద్వారా జాప్యానికి తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుందన్నారు.