రాగల 4-5 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు!

హైదరాబాద్/ అమరావతి: ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.
హైదరాబాద్: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.