రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసే లక్ష్యంతోనే కెసిఆర్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గావిచెర్ల గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. అంతకు ముందు బతుకమ్మలు, బోనాలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారులు ముందు నడువగా ఎద్దుల బండి నడుపుతూ మంత్రి రైతు వేదిక వద్దకు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2601 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవాలన్నీ దాదాపు పూర్తి కావచ్చాయని, మరికొన్ని చోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.