రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని!

న్యూఢిల్లీ : 2021 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరుకానున్నారని సమాచారం. గత నెల 27న జాన్సన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో సంభాషించారు. ఆ సమయంలో వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిధిగా రావాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో బ్రిటన్‌లో జరిగే జి-7 సదస్సుకు హాజరు కావాలని కూడా మోడీని జాన్సన్‌ కోరినట్లు సమాచారం. కోవిడ్‌పై పోరుతో సహా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వాతావరణ మార్పుల అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలిసింది. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు జాన్సన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాల్లో బ్రిటన్‌కు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల సహకారం అవసరమైన నేపథ్యంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పాలని బ్రిటన్‌ ప్రధాని బలంగా కోరుకుంటున్నారు. 1993లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేయర్ భారత్‌ రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.