రూ.30 కోసం బామ్మర్ది హత్య.. బావకు జరిమానాతో పాటు జీవితఖైదు!

ఆదిలాబాద్: కేలవం ముప్పది రూపాయల కోసం బామ్మర్థిని హత్య చేసిన కేసులో బావకి జీవిత ఖైదు శిక్ష పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. కేసులో మొత్తం 12 మంది సాక్ష్యుల విచారణ అనంతరం 4వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కం ఫ్యామిలీ కోర్టు ఇన్‌చార్జీ జడ్జి బీఎస్ జగ్‌జ్జీవన్ కుమార్ తీర్పును వెలువరించారు. దోషిగా తేలిన మనోహర్‌కు రూ. వెయ్యి జరిమానాతో పాటు జీవితఖైదును విధించారు. కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన జైనథ్ అప్పటి ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాస్, బేలా సబ్ ఇన్‌స్పెక్టర్ సాయిరెడ్డి వెంకన్న, కోర్టు డ్యూటీ ఆఫీసర్ డి. శ్రీనివాస్, ఇతరులను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే… ఈ ఘటన ఐదేళ్లక్రితం చోటుచేసుకుంది.. బేలా మండలం సిర్సన్నా గ్రామ నివాసి డాకే మనోహర్. రోజు కూలీ. ఇతని బామ్మర్ది డాకురే శ్యామరావ్(32). ఇతను కూడా రోజు కూలీనే. జీవనోపాధి నిమిత్తం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. 19 ఆగస్టు, 2015న రూ. 30 తిరిగి చెల్లించే విషయంలో బావ బామ్మర్దికి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో బామ్మర్ది శ్యామరావ్ చనిపోయాడు.