రేపటి ఎపి బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం
అమరాతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు (శుక్రవారం) తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఎపి సర్కార్ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని వెల్లడించారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దీనిలో భాగంగా రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఒంటిగంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.