రేపు వైసీపీలో చేరనున్న వరదా చక్రవర్తి

మండపేట: కాకినాడ పోర్టు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, కాకినాడ పోర్టు ఎంప్లాయిస్ యూనియన్ సొసైటీ అధ్యక్షులు సీతానగరం గ్రామవాసి వరదా చక్రవర్తి రేపు (సోమవారం) వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఆయన గత ఆరేళ్లుగా జనసేన పార్టీలో జిల్లాలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. సినీ నటుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ తోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లాకు ఐఏఎస్ లు, ఐపిఎస్ లు ఎవరు వచ్చినా గత నాలుగు దశాబ్దాలుగా కాకినాడ హోప్ ఐలాండ్, సముద్రం గమనం చేసేటప్పుడు వరదా చక్రవర్తిని పిలిపించుకుని ఆయన మినీ షిప్ లో విహారానికి, ఆహ్లాదానికి సంక్షేమ కార్యక్రమాలను హోప్ ఐలాండ్లో అమలు చేయడానికి ఆయనను వినియోగించుకున్నారంటే నావికాయానం లో ఆయనకున్న అనుభవం అర్థమవుతుంది.
రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్ ల తో సత్సంబంధాలు కలిగి ఉన్న వరద చక్రవర్తి కాకినాడ పోర్టులో 38 సంవత్సరాలు పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు. కాకినాడలో నాటి మల్లాడి స్వామి నుండి నేటి కురసాల కన్నబాబు వరకూ నాటి మంత్రులు అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి వరదా చక్రవర్తి. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు అప్పటి స్పీకర్ జిఎంసి బాలయోగి అప్పటి కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇంకా పలువురు అధికారులను తన సొంతంగా డ్రైవింగ్ చేసి వారిని హోప్ ఐలాండ్, రిలయన్స్ గ్యాస్ ఉత్పాదక కేంద్రాలకు సురక్షితంగా తీసుకు వెళ్ళ గలిగే ఏకైక వ్యక్తి సరంగు మినీ షిప్ డ్రైవర్ వరదా చక్రవర్తి.
అప్పటి నాటి ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు ను సైతం కాకినాడ తీసుకువెళ్లి వారి మన్ననలను పొందారు. అదే విధంగా అప్పటి మంత్రి చిక్కాల రామచంద్రరావు తో సంబంధాలు కలిగి ఉన్నారు. ఏడిద సీతానగరం గ్రామానికి చెందిన వరదా చక్రవర్తి ఎస్ ఎస్ ఎల్ సీ చదివి, షిప్ డ్రైవింగ్ నేర్చుకుని కాకినాడ పోర్టులో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన కాకినాడ పట్టణంలో అందరికీ క్లాస్ ఫోర్ ఉద్యోగాలు వేయించారు. కాకినాడ పట్టణంలో విస్తృత సంబంధాలు కలిగి ఉన్న చక్రవర్తి జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ లో చేరారు.
మండపేట నియోజకవర్గం లో పలువురితో సంబంధాలు కలిగి ఉన్న వరద చక్రవర్తిని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు సాధారణంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. తోట త్రిమూర్తులు ఆహ్వానాన్ని మన్నించి ఆయనతో సమావేశం జరిపి సోమవారం సీతానగరం గ్రామంలో రామాలయం వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే బహిరంగ సభలో వరదా తన రెండు వందల మంది అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. చక్రవర్తి తండ్రి వరదా గణపతి రైతు. అప్పట్లో అరటి పండు అరటి కాయలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. అదేవిధంగా వాణిజ్య పంటలైన కంద, బెల్లం మొదలగు వాటిని కలకత్తా అమలాపురం బెల్లం మార్కెట్ కు తరలించేవారు.
అనకాపల్లి ఎంపీ కొణతాల రామకృష్ణ తండ్రి బాలసుబ్రహ్మణ్యం తో కలిసి బెల్లం వ్యాపారం చేశారు. 1970 సంవత్సరం లో కొణతాల సుబ్రహ్మణ్యం ఏడిద సీతానగరం గ్రామానికి వచ్చి గణపతి తో ఉండి నాలుగు రోజులు ఆయన నివాసంలో బస చేసి ఆతిథ్యం స్వీకరించిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో ఈ విషయాలు అనకాపల్లి ఎంపీ గా పని చేసిన కొణతాల రామకృష్ణకు విధితమే. పలు సందర్భాల్లో అనకాపల్లి ఆహ్వానించి సత్కరించడం జరిగింది. వరద గణపతి ఏడిద గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా పనిచేసి అప్పటి మంత్రి ఎస్ బీ పీ బీ కే సత్యనారాయణ రావు ను కలుసుకుని ఏడిద గ్రామపంచాయతీ నుండి గ్రామాన్ని విడదీసి గెజిట్ విడుదల చేశారు. అప్పట్లో నామినేటెడ్ సర్పంచిగా వరదా గణపతి కొంతకాలం పనిచేశారు. ఈ విధమైన రాజకీయ నేపథ్యం ఉన్న వరదా వైసీపీ లో చేరుతుండటం పట్ల ఎంతో ఆనందదాయకమని నియోజకవర్గంలో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-టి.వి.గోవిందరావు
సీనియర్ జర్నలిస్టు/ న్యాయవాది