రైతుల లబ్ధి కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
ప్రతిపక్షాల వదంతులు నమ్మొద్దు: వారణాసి సభలో ప్రధాని మోదీ

వారణాసి: కేంద్ర సర్కార్ నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ఇవాళ (సోమవారం) జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతుల మెదళ్లలో దశాబ్ధాల నుంచి కొన్ని అపోహలు ఉండిపోయాయని, అయితే రైతుల్ని మోసం చేయాలని తాము భావించడం లేదని, కొత్త చట్టాలు.. పాత విధానాలను అడ్డుకోలేవు అని, గంగా నది తీరం నుంచి మాట్లాడుతున్నానని, తమ ఉద్దేశాలు కూడా గంగా నదిలా పవిత్రంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఒకవేళ అంతకుముందు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థే ఉత్తమమైనదని గ్రహిస్తే, మరి ఈ కొత్త చట్టాలు ఎలా అడ్డుకుంటాయని ఆయన అడిగారు. కొత్త మార్కెట్ విధానంతో సాంప్రదాయ మండీలకు ఎటువంటి నష్టం ఉండదని మోదీ అన్నారు. కనీస మద్దతు ధర కూడా మారదని ఆయన తెలిపారు.
సంస్కరణలు అనేవి రైతులకు కొత్త అవకాశాలను కల్పించాయని, రక్షణ కూడా కల్పించిందన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా రైతులకు మార్కెట్ కల్పిస్తున్నామని మోదీ తెలిపారు.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రైతులకు పూర్తి లబ్ధి చేకూరాలని, భారత్లో తయారవుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని, మరి రైతులకు అలాంటి మార్కెట్ అందుబాటులో ఉండకూడదా అని ఆయన అన్నారు. గతంలో మండీల బయట జరిగే లావాదేవీలను అక్రమంగా భావించేవారని, అయితే ఆ విధానం చిన్న రైతులకు వ్యతిరేకంగా ఉండేదని, ఎందుకంటే వారు మండీలకు వచ్చేవారు కాదు అని, అయితే కొత్త చట్టాలతో చిన్న చిన్న రైతులు కూడా మండీల బయట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు ఉంటుందని ప్రధాని తెలిపారు. రైతు వ్యతిరేకులు మాత్రమే కొత్త చట్టాలను నిరసిస్తున్నారని ఆయన విపక్షలపై మండిపడ్డారు.
రైతు వ్యతిరేకులే వదంతులు సృష్టిస్తున్నారు.
`రైతులకు వ్యతిరేకంగా కొందరు కావాలనే ఇలాంటి దష్ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై వదంతులు సృస్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు` అని ప్రతిపక్షాలను మోదీ పరోక్షంగా దుయ్యబట్టారు. `రైతులను నేను కోరేది ఒక్కటే. మా ప్రభుత్వం ట్రాక్ రికార్డు, పనితీరు చూడండి. అప్పుడు నిజమేంటో మీకు అర్థమవుతుంది` అని ప్రధాని అన్నారు.