రైతు ఖాతాలో రూ.473 కోట్లు!

భువ‌న‌గిరి:యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతు ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.473 కోట్ల మేర నగదు జమైంది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సంజీవరెడ్డికి భువనగిరిలోని డక్కన్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అత‌నికి డ‌బ్బులు అవ‌స‌రం ఉండ‌టంతో పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లాడు. ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. తన ఖాతాలోని బ్యాలెన్స్‌ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్‌ ఏమైనా వచ్చిందేమోనని ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా చెక్‌ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్‌ చూపించింది.

అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్‌ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్‌ చేసి ‘మీ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయ్యింది.. ఏటీఎం సర్వర్‌ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. ఏటీఎం రిసిప్ట్‌లో భారీ మొత్తంలో బ్యాలెన్స్‌ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది.

Leave A Reply

Your email address will not be published.