లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కుమ్రం భీం ఆసిఫాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంతో పారదర్శకత ఉంటుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం… ఎవరు కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇంత గొప్ప కొత్త రెవెన్యూ చట్టానికి నాంది పలికిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా నార్నూర్ లో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ ర్యాలీకి స్థానిక రైతులు, మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగనున్నాయన్నారు. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ, ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారన్నారు. ఇప్పటి వరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్ కోసం రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.