లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం ఆర్డినెన్స్‌

లక్నో : లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్డినెన్స్‌కు యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కార్ ఆమోదం తెలిపింది. వివాహం కోసం మతమార్పిడికి పాల్పడే వారు ఈ చట్టం ద్వారా శిక్షార్హులని, పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంది. నవంబర్‌ 24న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. మతమార్పిడిలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించనున్నట్లు బిజెపి రాష్ట్రాలైన యుపి, హర్యానా, మధ్యప్రదేశ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడటం సరికాదని, వీటిని అరికట్టేందుకు చట్టాలు అవసరమని ప్రభుత్వ ప్రతినిధి సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ నూతన చట్టాల కింద ఏడాది లేదా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15వేల జరిమానా విధించబడుతుందని అన్నారు. ఒకవేళ మైనర్‌ గాని, ఎస్‌సి, ఎస్‌టికి చెందిన యువతి అయితే.. మూడు నుండి పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25వేల జరిమానా వుంటుందని చెప్పారు. సామూహికంగా మతమార్పిడికి పాల్పడిన సంస్థలకు పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా ఉంటుందని మంత్రి అన్నారు. వివాహం అనంతరం మతం మార్చుకోవాలనుకుంటే.. రెండు నెలలకు ముందుగా జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఆయన అనుమతి తప్పనిసరని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.