`లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందితే శాఖాపరమైన చర్యలు`

భువనగిరి: పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఫిర్యాదులు అందితే కలెక్టర్లు తక్షణమే స్పందించి అక్కడికక్కడే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. మహిళల భద్రత కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ మహిళా అధికారులతో ఏర్పాటైన అత్యున్నతస్థాయి కోర్‌ గ్రూప్‌ కమిటీ శుక్రవారం స్మితా సబర్వాల్‌ అధ్యక్షతన భువనగిరి డాల్ఫిన్‌ హోటల్‌లో సమావేశమైంది. మహిళలకు అత్యవసర సహాయం కోసం, భద్రత కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100, 181 తదితర హెల్ప్‌లైన్‌ వ్యవస్థల పనితీరు గురించి, ఇతర సలహాలను, సూచనలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ..మహిళా శక్తిని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదన్నారు. మహిళల భద్రతా పరమైన సమస్యలు తెలుసుకుని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లపై విస్తృత ప్రచారం కల్పించి అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజ్‌, ఐఏఎస్‌ అధికారి యోగితా రాణా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేత మహంతి, నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రాంచంద్రన్‌, హైదరాబాద్‌ షీ టీమ్‌ ఇంచార్జి అధికారి అనసూయ(డీసీపీ), అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమశాఖాధికారి కృష్ణవేణి, డిప్యూటీ సంతోషణి, వివిధ శాఖల అధికారులు, మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.