లోకేశ్‌పై కేసు నమోదు

ఏలూరు: నిబంధనలను అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపినందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు ఆకివీడు ఎస్‌ఐ వై.వీరభద్రరావు సోమవారం చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం, నిబంధనలకు విరుద్దంగా ట్రాక్టర్‌పై కొందరిని ఎక్కించుకుని నిర్లక్ష్యంగా నడపడం, కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనలో భాగంగా సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఆయనతోపాటు టిడిపి నాయకులంతా ట్రాక్టర్ ట్రక్కులోనే ఉన్నారు. లోకేష్ నడుపుతున్న దారి బురదగా ఉండటంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఉప్పు టేరులోకి దూసుకెళ్లింది. లోకేష్ పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.