వరంగల్‌లో ఫిబ్రవ‌రి నుంచి ప్రతిరోజు మంచినీళ్లు

వరంగల్‌: వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో వచ్చే ఫిబ్రవ‌రి నుంచి ప్రతి రోజూ ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ నీటిని అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధిపనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంచినీటిని అందించేలా అంకితభావంతో కృషి చేయాల‌న్నారు.

సిబ్బంది, ఇత‌ర స‌మ‌స్యలేమున్నా వాటిని వెంట‌నే ప‌రిష్కరించాల‌ని చెప్పారు. అయితే, న‌గ‌ర పాల‌క సంస్థలో ప్రస్తుతం మంజూరైన పోస్టుల్లో 45 శాతం మాత్రమే సిబ్బంది ఉన్నార‌ని, మిగ‌తా సిబ్బంది నియామ‌కాలు అవ‌స‌ర‌మ‌ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంట‌నే ఆయా పోస్టుల భ‌ర్తీకి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఆదేశించారు.
న‌గ‌రంలోని మొత్తం 58 డివిజ‌న్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ త‌దిత‌ర ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పారిశుద్ధ్యం ప‌టిష్టంగా నిర్వహించాల‌న్నారు. న‌గ‌రంలో ఇప్పటికే పూర్తయిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. వాటిని ఫిబ్రవ‌రిలో ప్రారంభించేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.