వర్షం.. మ‌ళ్లీ షురూ!

హైదరాబాద్: ‌హైద‌రాబాద్‌ను వాన గండం ఇంకా వ‌ద‌ల‌లేదు. మ‌రోసారి న‌గ‌రంలో వాన దంచి కొడుతోంది. మొన్న‌టి వాన‌ను మ‌రువ‌క ముందే మ‌ళ్లీ న‌గ‌ర‌జీవిని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. ముంపు బాధితుల బాధ‌లు తీర‌క‌ముందే మ‌ళ్లీ మొద‌లెట్టింది. శ‌నివారం సాయంత్రం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కారు మేఘాలు క‌మ్ముకొని భారీ ఎత్త వ‌ర్షం కురిసింది. ఆ త‌రువాత కొద్ది సేపు ఆగిన‌ట్టే ఆగి మ‌ళ్లీ మొద‌లెట్టింది. ఉరుములతో ఉరిమి ఉరిమి కురుస్తోంది. ఆ చ‌ప్పుడు వింటేనే న‌గ‌ర‌జీవి గుండెలు బెంబేలెత్తిపోతోంది. న‌గ‌రంలోని దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌, మలక్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, మీర్‌పేట్‌, హయత్‌నగర్‌, పాతబస్తీ, సైదాబాద్‌లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మ‌రో మూడు రోజులు ముసురే!
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన వ‌ర్షాల వ‌ర‌ద‌ల్లోంచి ఇంకా తేరుకోక‌ముందే.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్ప‌డింది. దాంతో పాటు దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తనం, దీని మీదుగా 1.5 కిలో మీటర్ల నుంచి 2.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇది 20వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

 

సముద్రానికి అమావాస్య పోటు..

కాగా శనివారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం ఒకటి రెండు చోట్ల, ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.