విడాకులు తీసుకోనున్న ఐఏఎస్ టాపర్స్‌ జంట

జైపూర్‌: ఐఏఎస్ టాపర్స్‌ జంట టీనా దాబి, అధర్ ఖాన్ రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్(2015) పరీక్షలో టీనా మొదటి ర్యాంకు సాధించిగా, అధర్ రెండో ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పరీక్షలో విజయం సాధించిన అనంతరం వారు ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందారు. అక్కడి పరిచయమే 2018లో వారు వివాహం చేసుకునేందుకు దారితీసింది. వారిద్దరు వేరువేరు మతాలకు చెందిన వారు కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివాహం మతసామరస్యానికి చిహ్నమనే ప్రశంసలు దక్కాయి. అప్పట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ ..‘మీ ప్రేమ మరింత దృఢంగా మారనుంది. అసహనం, విద్వేశపూరిత ఘటనలు జరుగుతున్న తరుణంలో మీరు భారతీయులకు స్ఫూర్తిగా నిలవొచ్చు’ అంటూ ఆ జంటకు అభినందనలు తెలియజేశారు. వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్, సుమిత్రా మహాజన్ వంటి ప్రముఖులు కూడా వారి వేడుకకు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.