వేగవంతమైన దేశీయ ఎలక్ట్రిక్ బైక్ ‘క్రిడెన్’ విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ వన్ ఎలక్ట్రిక్ దేశంలోనే అత్యంత వేగవంతమైన విద్యుత్ బైక్ ‘క్రిడెన్’ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. తొలి దశలో భాగంగా హైదరాబాద్, బెంగళూరులో దీన్ని వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. కొత్త ఏడాది జనవరిలో తమిళనాడు, కేరళలలో అక్కడి వినియోగదారులకు.. ఆ తర్వాత మహరాష్ట్ర, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు తాజాగా ప్రకటించింది. సంస్కృతంలో క్రిడెన్ అంటే క్రీడ అనే అర్థంతో దీన్ని ఆవిష్కరించింది.
క్రిడెన్ దేశంలోనే అత్యంత వేగవంతంగా ద్విచక్ర విద్యుత్ వాహనం (ఇవి)గా నిలువనుంది. ఇది గంటకు గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. 3 కిలోవాట్ లిథియం ఐయాన్ బ్యాటరీతో వస్తోన్న ఈ మోటార్ సైకిల్ 7.4 బిహెచ్‌పి లేదా 5.5 కిలోవాట్ శక్తిని కలిగి ఉంది. 240 ఎంఎం డిస్క్ అఫ్ ఫ్రంట్, 220 ఎంఎం డిస్క్ రేర్ కంబైన్డ్ బ్రేకింగ్‌తో రూపొందించింది. ఈ మోటార్ సైకిల్ తయారీలో 80 శాతం ఉత్పత్తులు స్థానికంగా తయారయినవేనని ఆ కంపెనీ సిఇఒ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.