వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

స్టాక్‌హోం : ప‌్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురిని నోబెల్ వరించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు. హెపటైటిస్ సీ వైరస్ ఆవిష్కరణకుగాను అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్, చార్లెస్ ఎమ్ రైస్, బ్రిటన్‌కు చెందిన మైఖేల్ హౌఘ్టన్ 2020 నోబెల్ బహుమతిని సంయుక్తంగా గెలుచుకున్నారు. స్టాక్‌హోంలో సోమవారం ఉదయం కరోలినా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరి పేర్లను నోబెల్ బహుమతి కమిటీ ప్రకటించింది. హెపటైటిస్ సీ వైరస్‌పై పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ దక్కడం వైరల్ వ్యాధులపై కొనసాగుతున్న యుద్ధంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సిరోసిస్, కాలేయ సంబంధ క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన ఆరోగ్య సమస్య అయిన రక్తం ద్వారా కలిగే హెపటైటిస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో నిర్ణయాత్మక సహకారం అందించిన ముగ్గురు శాస్త్రవేత్తలు హార్వే జే ఆల్టర్, చార్లెస్ ఎమ్ రైస్, బ్రిటన్‌కు చెందిన మైఖేల్ హౌఘ్టన్ అని నోబెల్ బహుమతి కమిటీ ప్రశంసింది.
“హార్వే జె ఆల్టర్, మైఖేల్ హౌఘ్టన్, చార్లెస్ ఎమ్ రైస్ సెమినల్ ఆవిష్కరణలు చేశారు. ఇది హెపటైటిస్ సీ వైరస్ అనే వైరస్ యొక్క గుర్తింపునకు దారితీసింది. ఇప్పటివరకు హెపటైటిస్ ఏ, బీ వైరస్‌ల ఆవిష్కరణ క్లిష్టమైన దశలు, రక్తంలో కలిగే హెపటైటిస్ కేసులలో ఎక్కువ భాగం వివరించబడలేదు. హెపటైటిస్ సీ వైరస్ యొక్క ఆవిష్కరణ దీర్ఘకాలిక హెపటైటిస్ కేసులకు కారణాన్ని వెల్లడించింది”అని నోబెల్ కమిటీ తెలిపింది. అలాగే ఎంతో మంది ప్రాణాలను వైద్యులు రక్షించగలుగుతున్నారు అని అన్నారు.