వైభవంగా మల్లన్న కల్యాణం

హైదరాబాద్: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరుగుతోంది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో క్రతువు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కల్యాణం జరుగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ సైతం బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
వివాహోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు వివాహ వేడుకకు హాజరయ్యారు. మలన్న కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.