వ్యాన్ బోల్తా.. పెళ్లి కొడుకు మృతి, 9మంది పరిస్థితి విషమం!
విశాఖపట్టణం: జిల్లాలోని జి.మాడుగుల (పాడేరు) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యాన్ బోల్తాపడింది. గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి వ్యాన్ బోల్తా ఘటనలో పెళ్లికొడుకుతోపాటు మరో మహిళ మృతిచెందింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. వీరిలో మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకెళ్తే.. గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వంతాల శివ వారం రోజుల క్రితం మగతపాలెం గ్రామానికి చెందిన గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడు. కడుగుల గ్రామం నుంచి వ్యాన్‌లో నవ వధూవరులు, వారి బంధువులు చుట్టరికం నిమిత్తం గురువారం మగతపాలెం వచ్చారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి 45 మంది వ్యాన్‌లో తిరుగు పయనమయ్యారు. మగతపాలెం సమీపంలోని ఘాట్‌రోడ్డుకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇదే వ్యాన్‌లో ఉన్న పెళ్లి కొడుకుతో పాటు, కడుగుల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీదరి పొట్టి, వంతాల పండు, వంతాల శివ, రవి, శ్రీరాములు, కృష్ణ, పవన్బాబు, వంతాల వెంకటరావుతోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా పెళ్లికొడుకు వంతాల శివ మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.