వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్

స్టాక్‌హోం : ఆకలిపై పోరాడుతున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ)కి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై ఊపిరిసలపని పోరు సాగించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ చేపట్టిన సేవలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి దక్కిందని నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. యుద్ధ ప్రాంతాల్లో ఆక‌లిని ఆయుధంగా మార్చుకుని శాంతిని స్థాపించిన‌ట్లు క‌మిటీ చెప్పింది. మాన‌వాళిని పీడిస్తున్న ఆక‌లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అతిపెద్ద కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. 2019లో 88 దేశాల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న సుమారు వంద మిలియ‌న్ల మందికి ఆహారాన్ని అందించిన‌ట్లు నోబెల్ క‌మిటీ ప్ర‌శంసించింది.

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌లి స‌మ‌స్య‌లు పెరిగిన‌ట్లు క‌మిటీ పేర్కొన్న‌ది. అయితే ఇటువంటి విప‌త్క‌ర స‌మ‌యంలో డ‌బ్ల్యూఎఫ్‌పీ త‌న సామర్ధ్యాన్ని పెంచి సేవ‌ల‌ను అందించిన‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది. శాంతి స్థాప‌న కోసం ఫుడ్ సెక్యూర్టీ కీల‌క‌మైంద‌ని వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నిరూపించిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌భ్య‌దేశాల‌ను కూడా ఈ ప్రోగ్రామ్‌లో భాగ‌స్వామ్యుల‌ను చేసేందుకు డ‌బ్ల్యూఎఫ్‌పీ ప్ర‌య‌త్నించిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. డబ్ల్యూఎఫ్‌పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. డిసెంబర్‌ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో 11 లక్షల డాలర్ల ప్రైజ్‌ మనీతో పాటు శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు.

 

 

Leave A Reply

Your email address will not be published.