శామీర్‌పేటలో బాలుడి అదృశ్యం విషాదాంతం

శామీర్‌పేట: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఈనెల 15న అదృశ్యమైన బాలుడు అథియాన్ (5) ఘటన విషాదాంతమైంది. శామీర్‌పేట అవుటర్ రింగురోడ్డు పక్కన మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. శామీర్‌పేట సిఐ సంతోష్ తెలిపిన వివరాల మేరకు.. శామీర్‌పేటకు చెందిన సయ్యద్ హుస్సేన్, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్ స్థానిక పాఠశాలలో చదువున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సయ్యద్ హుసేన్ ఇంటి పక్కనే అద్దెకుంటున్న బిహార్‌కు చెందిన సోన్‌సోన్ మూడు రోజుల కిందట ఫోన్ చేసి రూ. 15 లక్షలు ఇస్తే బాలుడిని అప్పగిస్తానని బెదరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా బాలుడిని చంపేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం ఘటనాస్థలంలో మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. అయితే బాలుడిని చంపి దాదాపు 15 రోజులు అవ్వడంతో మృతదేహం కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.