సాగర్ రోడ్డుపై ప్రమాదం.. తల్లీకుమారుడు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.