సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం
పుణె: పుణెలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియాకు చెందిన టెర్మినల్ గేట్-1 వద్ద గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని మంజ్రీ ప్రాంతంలో గల ఈ సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పది యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది.
ఈ ప్లాంట్లో పలు వ్యాక్సిన్లతో పాటు కొవిషీల్డ్ ఉత్పత్తి జరుగుతుంది. అగ్నిప్రమాదం వల్ల కొవిషీల్డ్ ఎటువంటి ఆటకం లేదని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఎస్ఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ మాట్లాడుతూ.. బీసీజీ వ్యాక్సిన్ సంబంధిత పనులు జరుగుతున్న ప్రాంతంలో మంటలు సంభవించాయన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ, నిల్వ ఈ ప్రాంతానికి దూరంగా ఉందని పేర్కొన్నారు. పీఎంసీ చీఫ్ ఆఫీసర్ ప్రశాంత్ రాన్పైస్ మాట్లాడుతూ.. భవనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో ముగ్గురిని రక్షించినట్లు వెల్లడించారు.
కాగా ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పుణెలో 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన మంజ్రీ ప్లాంట్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.