సీరం వ్యాక్సిన్ ధర రూ.250!

బెంగళూరు :సీరం ఇన్‌స్టిట్యూట్.. టీకాల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ. అంతేకాదు.. ఉత్పత్తి సామార్థ్యం పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారు కూడా! అందుకే.. అధిక జనాభా కలిగిన భారత్ అవసరాలు తీర్చేందుకు సీరం అనువైనది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో.. దేశ అవసరాలకు సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం పైనే ఆశలు పెట్టుకుంది.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను రూ. 250 లకే సరఫరా చేసే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు అయిన సీరం సంస్థ ఆస్ట్రాజెన్‌కాతో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద అనుమతించాల్సిందిగా సోమవారం ప్రభుత్వాన్ని కోరింది. మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ ఒక మోతాదుకు వెయ్యి రూపాయిల ధరను నిర్ణయించారని, అయితే భారీ మొత్తంలో సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వాలకు తక్కువ ధరకు విక్రయించనున్నట్లు సీరం సంస్థ సిఇఒ అదర్ పూనావాలా తెలిపారు. ఇతర దేశాల కన్నా ముందుగా భారత్‌లోనే ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ నివేదికపై సీరం ఇన్‌స్టిట్యూట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించలేదు.