హత్య చేసి.. మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు!
కొణిజర్ల: మద్యం మత్తులో వివాదం తలెత్తడంతో క్షణికావేశంలో క్లీనర్‌ని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసిన డ్రైవర్, శవాన్ని లారీలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన షాకింగ్ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ ఘోర ఘటన జిల్లాలోని కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ నైఫ్ రాజు.. క్లీనర్ రాజుతో కలసి కరీంనగర్ నుంచి వరి నూకల లోడుతో బయలుదేరారు. మార్గం మధ్యలో ఫుల్లుగా మద్యం తాగిన డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో క్లీనర్ రాజు కత్తితో డ్రైవర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన డ్రైవర్ నైఫ్ రాజు లారీలోని ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో క్లీనర్ రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని లారీ క్యాబిన్లో వేసుకుని నేరుగా కొణిజర్ల పోలీస్ స్టేషన్‌కి వచ్చి డ్రైవర్ లొంగిపోయాడు. క్లీనర్ రాజు తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రాడ్డుతో కొట్టానని, అతను చనిపోయాడని పోలీసులకు చెప్పాడు. కొణిజర్ల ఎస్సై మొగిలి కేసు నమోదు చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.