హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ అరెస్టు!

చెన్నై: మ‌ద్రాస్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి సి.ఎస్‌. క‌ర్ణ‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌హిళా జ‌డ్జిలు, న్యాయ‌మూర్తుల భార్య‌లపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో కూడిన వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మూడు ఎఫ్ఐఆర్ లు దాఖ‌ల‌య్యాయి. దీంతో పోలీసులు ఆయ‌న్ను బుధ‌వారం అదుపులోకి తీసుకున్నారు. జ‌స్టిస్ సి.ఎస్‌. క‌ర్ణ‌న్ గ‌తంలో మ‌ద్రాస్, కోల్‌క‌తా హైకోర్టుల‌లో న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జ‌డ్జిలల‌పై అభ్యంత‌క‌ర వీడియో విడుద‌ల చేసిన ఆయ‌న‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో జాప్యాన్ని నిర‌సిస్తూ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ స‌భ్యులు మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇటీవ‌ల దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.. ఈ కేసు ద‌ర్యాప్తులో పురోగ‌తి ఏమిట‌ని పోలీసుల‌ను ప్ర‌శ్నించింది. త‌మిళ‌నాడు డిజిపి, చెన్నై పోలీసు క‌మిష‌న‌ర్ వ్య‌క్తిగ‌తంగా ఈ నెల 7న న్యాయ‌స్థానం ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. అయితే, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చెన్నై సెంట్ర‌ల్ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధ‌వారం సి.ఎస్‌. క‌ర్ణ‌న్‌ను క‌స్ట‌డిలోకి తీసుకున్నారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి పరారైన కర్ణన్‌ను జూన్ 20న కోయంబత్తూరులో సీఐడీ అరెస్ట్ చేసింది. పరారీలో ఉండగా రిటైరైన తొలి హైకోర్టు జడ్జిగా కర్ణన్ రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ కర్ణన్ పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.