హైదరాబాద్‌ ఐటి కారిడార్‌లో చిరుత కలకలం!

హైదరాబాద్‌ : గ‌త కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో పులుల సంచారం వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో అయితే ఏదో ఓ జిల్లాలోని పులి సంచరిస్తూనే ఉంది. తాజాగా నగర నడిబొడ్డున చిరుత సంచరిస్తుందన్న వార్త ఇప్పుడు నగరవాసుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటివరకు సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం ఆందోళన కలిగిస్తుంటే.. తాజాగా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలిలోని ఐటి కారిడార్‌లో చిరుత సంచరిస్తుందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. గచ్చిబౌలిలోని రొడా మిస్త్రీ కాలేజీలో ఓ కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది. కాలేజీలో చిరుత సంచరించినట్టు తెలిసిన వెంటనే స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి చిరుత కోసం ట్రాక్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే కాలేజీ పక్కన ఉన్న గుట్టల్లోకి చిరుత వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో చిరుత కోసం గాలింపును ముమ్మరం చేశారు. అయితే చిరుత సంచరించినట్లు ఆనవాళ్లేవీ కనిపించడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.