140 కోట్లతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
విగ్రహ నమూనాను ఆవిష్కరించిన ఈటల

హైదరాబాద్: నెక్లెస్ రోడ్‌లో ఎన్టీఆర్ గార్డెన్‌లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.140 కోట్లతో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో కలిసి కొప్పుల విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విగ్రహ నమూనాను ఈటల ఆవిష్కరించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ఆయన 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కొప్పుల గుర్తు చేశారు. దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలో 11 ఎకరాల్లో అంబేడ్కర్ పార్కును ఏర్పాటు చేస్తామని, అందులోనే ఆయన విగ్రహాన్ని నిర్మిస్తామని తెలిపారు.