16 నుండి 28,335 మందికి గొర్రెల పంపిణీ
నల్లగొండలో పంపిణీ ప్రారంభిస్తాం: మంత్రి తలసాని

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు కరోనా కారణంగా నిలిచిపోయిన తొలివిడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణలో తక్షణమే చేపట్టనున్నారు. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీపై దృష్టిపెట్టింది. ఈ నెల 16న నల్లగొండలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ జరుగుతుందని తెలిపారు.
శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇప్పటివరకు డీడీలు చెల్లించిన 28,335 మందికి 5.95 లక్షల గొర్రెల పంపిణీ కోసం రూ.360 కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. త్వరలో రెండోవిడుత గొర్రెల పంపిణీ కోసం వచ్చే బడ్జెట్లో రూ.4,210 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్కసారి మాటిస్తే అది చట్టం చేసినట్టేనని, కాస్త ఆలస్యమైనా పథకం పక్కాగా అమలవుతుందని స్పష్టంచేశారు.