22న మేయర్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఈనెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు.
గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్)
వయస్సు: 56
భర్త: బాబీరెడ్డి
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
కులం: మున్నూరు కాపు (బీసీ)
మేయర్ విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైదరాబాద్‌లోని హోలీ మేరి స్కూల్‌లో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. కాగా వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. తాజాగా బంజారాహిల్స్ కొర్పోరేటర్ గా గెలుపొందారు.