24 గంటల్లో 74,442 కొత్త కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 74,442 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 66 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల ఉంది. అదే సమయంలో వైరస్ కారణంగా 903 మంది మరణించారు. ప్రస్తుతం 66,23,816 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,34,427 కాగా, 55,86,704 మంది రోగులు డిశ్ఛార్జి అయ్యారు. అదే సమయంలో, ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 75,829 కేసులు నమోదవగా, 940 మంది రోగులు మరణించారు. కోవిడ్ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,02,685కు చేరింది. కరోనా బాధితుల రికవరీ రేటు 84.34 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 14.11 శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటలలో 9,89,860 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,99,82,394గా ఉంది.