Hyderabad: ఇక నుంచి 24 గంటలు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ వెల్లడించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో.. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన జలమండలి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి రోజుకి 9 వేల ట్రిప్పుల నీరు సరఫరా చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి వాణిజ్య వినియోగదారుల కోసం 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేస్తామన్నారు. దీని కోసం 250 కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను కూడా సమకూర్చుకుంటామని పేర్కొన్నారు.