24,25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

విశాఖపట్నం: 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశ వైపు కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించి ఈ నెల 25న తమిళనాడు–పుదుచ్ఛేరి తీర ప్రాంతానికి చేరనుందని ఐఎండీ వివరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు శనివారం అనంతపురంలో రికార్డు స్థాయిలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 14.7, చింతపల్లిలో 15.2, అరకులో 18.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.