3 నెలల్లో యాదాద్రి!
పనుల్లో వేగం పెంచాలని సిఎం కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్: మరో మూడు నెలల్లో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ మేరకు అధికారులు పనుల్లో వేగంపెంచాల్సిన అవసరమున్నదని సిఎం పేర్కొన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీయే ప్రత్యేకాధికారి కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, స్థపతి ఆనంద్‌సాయి పాల్గొన్నారు.
గుట్టమీదకు బస్సులు వెళ్లే మార్గాలు, వీఐపీ కార్ పార్కింగ్, కల్యాణకట్ట, పుష్కరిణిఘాట్, బ్రహ్మోత్సవ, కల్యాణమండపాల నిర్మాణాలపై ఆరాతీశారు. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్నందున యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాల నుంచి రాజధానికి వచ్చే టూరిస్టులు దర్శించుకునే అవకాశాలుంటాయని కేసీఆర్ తెలిపారు. యాదాద్రి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి సాటిచెప్పేలా ప్రభుత్వం కృషిచేస్తున్నదని, నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆలయపరిసరాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా పెద్దపెద్ద చెట్లతో భవిష్యత్‌లో పచ్చదనం శోభిల్లేలా మొక్కలను నాటాలని.. వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్లను పెంచాలని సూచించారు. ప్రస్తుతం యాదాద్రి బస్టాండ్ స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా గుట్ట సమీపంలో ఏడెకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసి ఆలయ నియమాలను అనుసరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బస్టాండ్‌ను నిర్మించుకోవాలని సూచించారు. యాదాద్రికి చేరువలోఉన్న గండిచెరువును అద్భుతమైన ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. యాదాద్రి టెంపుల్‌సిటీలో 250 డోనర్ కాటేజీలను ఏర్పాటుచేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతియాభై కాటేజీలకు ఒక ప్రత్యేక డిజైన్‌ను రూపొందించి.. వాటికి భక్తప్రహ్లాద, అమ్మవార్ల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. కుటుంబంతోసహా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రశాంతత కల్పించేలా, యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్దర్శనంపై భక్తులకు ఆసక్తిపెరిగేలా విశాలమైన స్థలాల్లో వాటిని నిర్మించాలని సూచించారు. అలాగే దేవాలయ విమానగోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలనిఆదేశించారు.