3 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు
కొవిడ్: కేసులు 2,73,810.. మరణాలు 1,619
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. 3 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. దేశంలో తొలి వేవ్ భయపెడితే… సెకండ్ వేవ్‌లో భయం తగ్గినా కానీ కేసులు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో భారత్‌లో 13,56 లక్షల పరీక్షలు చేయగా .. 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 1,619 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,78,769 మంది ప్రాణాలు వదిలారు.
ఇదే సమయంలో 1,44,178 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1,29,53,821 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.
కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 68,631 కేసులు నమోదయ్యాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 25,462 కేసులు నమోదయ్యాయి.