3 వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం సంతరించుకున్నాయి. వ్యవసాయ బిల్లులపై ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన తెలిపినప్పటికీ, మూజువాణి ఓటుతో బిల్లులను ప్రభుత్వం గెలిపించుకుంది. దీంతో ఈ వివాదాస్పద బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ ప్రతిపక్షాలు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించాయి. బిల్లులకు వ్యతిరేకంగా పలుచోట్ల రైతుల ఆందోళనలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఆమోదించిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించిన రైతు ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు 2020, రైతుల ధర భరోసా (సాధికారత మరియు రక్షణ), వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు 2020, ముఖ్యమైన వస్తువుల (సవరణ) బిల్లు 2020ను ఆమోదిస్తున్నట్లు గెజిట్లో పేర్కొన్నారు. దీంతో ఈ మూడు వ్యవసాయ బిల్లులు ఇక చట్టంగా మారినట్లే.
మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. పంజాబ్ రైతులు శుక్రవారం బంద్ పాటించగా హర్యానా రైతులు సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చారు. కాగా, కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి దృష్టి రాష్ట్రపతి నిర్ణయం మీదే పడింది. అయితే, అంతిమంగా పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లులకు ఆమోదముద్ర వేయడానికే రాష్ట్రపతి మొగ్గుచూపారు.
President gives his assent to the three #FarmBills :
▪️Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020
▪️Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020
▪️Essential Commodities (Amendment) Bill 2020 pic.twitter.com/PmjG4jNopC— All India Radio News (@airnewsalerts) September 27, 2020