30 ఏళ్ల తర్వాత చైనాకు భారత్ బియ్యం ఎగుమతి

ముంబయి : భార‌త్ నుంచి బియ్యం కొనుగోలుకు చైనా ముందుకొచ్చింది. ల‌ద్దాఖ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో దాదాపు మూడు ద‌శ‌బ్దాల త‌ర్వాత తొలిసారి డ్రాగ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ నుంచి బియ్యం దిగుమ‌తుల‌ను చైనా ప్రారంభించింద‌ని బియ్యం మిల్లుల ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం భారత్‌ కాగా.. దిగుమతి చేసుకునే దేశం చైనా. గతంలో ఏడాదికి 4 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునే చైనా.. క్వాలిటీని సాకుగా చూపుతూ …కొనుగోలుకు దూరంగా ఉండిపోయింది. సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాజకీయ ఉద్రికత్తల ఉన్నప్పటికీ ఈ పురోగతి సాధించడం గమనార్హం. తొలిసారిగా బియ్యాన్ని చైనా కొనుగోలు చేసిందని, ఈ పంట నాణ్యతను చూసిన తర్వాత వచ్చే ఏడాది మరింత కొనుగోలు చేసే అవకాశాలున్నాయని బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి. కృష్ణారావు తెలిపారు. డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో టన్నుకు రూ.22 వేల చొప్పున లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పరిశ్రమ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చైనా థాయిలాండ్‌, వియత్నాం, మయాన్మార్‌, పాకిస్తాన్‌ల నుండి బియ్యం కొనుగోలు చేస్తూ వస్తోంది.

మ‌రోవైపు, చైనాకు బియ్యం స‌ర‌ఫ‌రా చేసే సంప్ర‌దాయ దేశాలైన థాయిలాండ్‌, వియ‌త్నాం, మ‌య‌న్మార్‌, పాకిస్థాన్‌ల‌లో బియ్యం నిల్వ‌లు ప‌రిమితంగా ఉండ‌టం, భార‌త్‌తో పోలిస్తే టన్ను బియ్యానికి క‌నీసం 30 డాల‌ర్లు అధికంగా కోట్ చేశాయ‌ని వాణిజ్య అధికారులు పేర్కొంటున్నారు. భార‌త్ నుంచి ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టంతో చైనా మ‌న దేశం బియ్యంపై దృష్టి సారించింద‌ని తెలుస్తోంది.

1 Comment
  1. Mallesh Yengani says

    ఆకలి తీర్చే దేశం భారత్….

Your email address will not be published.