33 మంది ఎలిమినేషన్
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. కాగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లలెక్కింపులో ఇప్పటి వరకు 33 మంది వరకు ఎలిమినేషన్ అయ్యారు. ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల ఓట్లు తొలి మూడు స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేయనున్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 124 ఓట్లు జమ కాగా, తీన్మార్ మల్లన్నకు 115 ఓట్లు, కోదండరామ్‌కు 127 జమ అయ్యాయి.
అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికి స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక వేళ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్ల వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో సురభివాణీదేవికి 1,12,689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచందరరావుకు 1,04,668, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,610 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో 21,309 ఓట్లు చెల్లలేదు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.