AP: గిరిజన శాఖకు 5 జాతీయ అవార్డులు: మంత్రి పుష్ప శ్రీవాణి

అమరావతి (CLiC2NEWS): వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ,సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ లోనూ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని డిప్యూటీ సిఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ విభాగాలతో పాటుగా జీసీసీ 5 జాతీయ అవార్డులను సాధించిందని వెల్లడించారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు.
వన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఎపికి మొదటి ర్యాంకును కేటాయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు మొదటి ర్యాంకును ఇచ్చారని డిప్యూటీ సిఎం వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు.