12 హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లను సిఫార్సు కొలీజియం

న్యూఢిల్లీ (CLiC2NEWS): న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వాయు వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సుప్రీంకోర్టుకు ఒకేసారి అత్యధికంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఈ 12 హైకోర్టుల్లో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. భారత న్యాయ చరిత్రలో ఒకేసారి ఇంతమంది జడ్జిలను సిఫారసు చేయడం ఇదే తొలిసారి. జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ కూడా ఈ కొలీజియంలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 112 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న కొలీజియం.. 68 మంది పేర్లను సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది.

మిజోరాం నుండి మొదటి మహిళా జ్యుడిషియల్‌ ఆఫీసర్‌గా గుర్తింపు పొందిన మార్లీ వాంకుంగ్‌ గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని కేంద్రం ఆమోదిస్తే మిజోరం నుంచి హైకోర్టు తొలి న్యాయమూర్తిగా వాన్‌కుంగ్‌ చరిత్ర సృష్టించనున్నారు. మర్లీ షెడ్యూల్‌ తెగకు చెందిన వారని, ఆమెతో పాటు మరో తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు… వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతి కోసం కొలీజియం గత నెల 25, ఈ నెల 1న సమావేశాలు నిర్వహించింది. పదోన్నతి కోసం 112 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించగా…68 పేర్లను ఫైనల్‌ చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో 44 మంది బార్‌కు చెందిన వారుకాగా, 24 మంది జ్యుడిషియల్‌ సర్వీసుకు చెందినవారు. సిఫారసు చేసిన జాబితాలో పదిమంది మహిళలు కూడా ఉన్నారు. న్యాయమూర్తుల కొరతతో దేశంలోని వివిధ హైకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం జడ్జిల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలను కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

కాగా 68 మంది జడ్జిలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే.. అలహాబాద్‌, రాజస్తాన్‌, కోల్‌కతా, జార్ఖండ్‌, జమ్ముకాశ్మీర్‌, మద్రాస్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, కేరళ, చత్తీస్‌గఢ్‌, అసోంలో వీరంతా నియమితులు కానున్నారు.

Leave A Reply

Your email address will not be published.