రెండున్నరేళ్లలో పోర్టు పనులు పూర్తి : సిఎం జగన్‌

అమరావతి: పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో​ రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. మూడు పోర్టులు, ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు, కొపపర్తి పారిశ్రామిక క్లస్టర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైల్‌ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భోగాపురం నుండి విశాఖకు చేరుకునేందుకు చేపట్టిన బీచ్‌రోడ్డు నిర్మాణం ఎంతవరకూ వచ్చిందనే అంశంపై చర్చించారు. పోలవరం నుండి విశాఖకు తాగునీటి సరఫరా ప్రాధాన్యతగా ఉండాలని, త్వరగా డిపిఆర్‌ తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు రెండున్నరేళ్లలో పూర్తి కావాలన్నారు.

విశాఖపట్నం, చెన్నై, అచ్యుతాపురం క్లస్టర్‌, నక్కపల్లి క్లస్టర్లలో పనుల తీరునూ అడిగి తెలుసుకున్నారు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు. పరిశ్రమలకు వీలైనంత త్వరగా డిశాలినేషన్‌ నీటిని వినియోగించేలా చూడాలని, లీటరు నీరు నాలుగు పైసలకు వస్తుందని, దీనివల్ల తాగునీటిని ఆదా చేసుకోవచ్చని వివరించారు. ఇండిస్టియల్‌ కారిడార్లు, పారిశ్రామికవాడల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పరిశ్రమల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు.

తిరుపత్తి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్‌ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగిస్తామని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు మొదలుపెడతామని తెలిపారు. మొదటిదశలో నాలుగు బెర్తులతో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని వివరించారు.

భావనపాడుకు డిసెంబర్‌కు 15కు టెండర్లు ఖరారు చేసి, 2021 మార్చి నుంచి పనులు మొదలుపెడతామని వివరించారు. మొదటిదశలో నాలుగు బెర్తులతో 25 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని పేర్కొన్నారు. సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సిఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఎపిఐఐసి విసి అండ్‌ ఎమ్‌డి రవీన్‌కుమార్‌రెడ్డి, మారిటైం బోర్డు సిఇఓ రామకృష్ణారెడ్డి, ఎపిఐఐసి ఇడి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.