మహిళా భద్రత పోలీసుల లక్ష్యం: అదనపు ఎస్పీ నర్మద
నల్లగొండ : మహిళల రక్షణ తొలి ప్రాధాన్యతగా నల్లగొండ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా మహిళా హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు, విద్యార్థినీలకు తొలిసారిగా ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోలీస్, ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపధ్యంలో తొలిసారిగా ఆన్ లైన్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీలు, మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి ఆన్ లైన్ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ కు ముందు కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే వారి పట్ల వేధింపులు ఒక రకంగా ఉంటే కోవిడ్ సమయంలో, ఆ తర్వాత ఆన్ లైన్ మోసాలు, ఆన్ లైన్ లైంగిక వేధింపులు మరింత పెరిగి పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ వేధింపుల పట్ల మహిళలు పిర్యాదు చేయడానికి ధైర్యంగా బయటికి రావాలని అప్పుడే వారికి న్యాయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావలసిన అవసరం లేకుండా షీ టీమ్స్ ఫోన్ నెంబర్ల ద్వారా మెసేజ్, వాట్స్ అప్ రూపంలో సైతం పిర్యాదు చేయవచ్చని, పిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆమె వివరించారు. మహిళలు, విద్యార్థినీలు సామాజిక మాధ్యమాలను వినియోగించే క్రమంలో అవసరమైన సెక్యూరిటీ ఫీచర్స్ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. మహిళల రక్షణ ప్రధాన ధ్యేయంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాక్ ఐ యాప్ రానున్న నూతన సంవత్సరం నుండి జిల్లాలో అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. దీనిలో ఉండే ఎస్.ఓ.ఎస్. ఫీచర్ బటన్ నొక్కడం ద్వారా బటన్ నొక్కిన మహిళలు ఉన్న ప్రాంతానికే పోలీసులు చేరుకునేలా సేవలందిస్తుందిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా ఆన్ లైన్ మోసాల వలలో పడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. మహిళల రక్షణ కోసం జిల్లా పోలీసు తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి వాటి ద్వారా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 300 మంది వరకు సత్వర న్యాయం అందించగలిగామని చెప్పారు. ఆన్ లైన్ అవగాహన కార్యక్రమాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వరకు షీ టీమ్స్ ను చేర్చడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తున్నదని. సామాజిక మాధ్యమాల వినియోగంలో సైతం మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం కలుగుతుందదని అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.
ఆన్ లైన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు, హాక్ ఐ యాప్ గురించి ఐ.టి. సెల్ సిఐ గోపి, మహిళా రక్షణకు జిల్లా పోలీసుల ప్రాధాన్యత, షీ టీమ్స్ పనితీరు గురించి సమగ్రంగా వివరించారు. ఆన్ లైన్ అవగాహన కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ గౌడ్, ఐటి సెల్ సిఐ గోపి, మహిళా పోలీస్ ఏ.ఎస్.ఐ.లు విజయ లక్ష్మి, కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్స్ రమేష్, నర్సింహా, పాషాతో పాటు కమ్యూనికేషన్, మహిళా పోలీస్ స్టేషన్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.